అపురూపమైన "భైరవకొన" మన ఆంధ్రదేశంలో..




















భైరవకొన.  మన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నందు సి.యస్. పురం మండలంలో ఉన్నది. (.సి.యస్.పురం అంటే పూర్తిపేరు చంద్రశేఖర పురం). అంబవరం కొత్తపల్లి అనేవూరు. ఆ  ఊరిలో అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు నెలవైన లోయ భైరవకోన. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులలో వున్నదీ ప్రదేశం.






ఈ కోనలో ప్రవేశించగానే మనకి కనిపించేది అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం. ఆయన ప్రక్కనే ఉన్న దారిలో లోపలకి వెళ్తే 200 మీటర్ల ఎత్తునుంచి దూకే అతి సుందరమైన జలపాతం. వేసవికాలంలో నీరు కొంచం తక్కువగా వుంటుంది. కొండల మీద నుంచి ప్రవహించే ఆ జలపాతం కింద ఏర్పాటు చేసిన కాంక్రీటు తొట్టెలలో  చేరుతాయి. ఇక్కడికి వచ్చిన వారందరూ ఆ జలపాతంలో స్నానం చేస్తారు. ఈ జల ప్రవాహం తను పయనించే మార్గంలో ఉన్న వివిధ వైద్య మూలికలను ఒరుసుకుని ప్రవహించటంతో ఆ నీటిలో స్నానం చేసినవారికి అనేక రుగ్మతలనుంచి విముక్తి లభిస్తుందిని ఇక్కడివారి నమ్మకం. అందుకే నీరు ఎంత తక్కువ వున్నా వచ్చినవారిలో చాలామంది అక్కడ స్నానం చేస్తుంటారు.

ఇక్కడి మరొక విశేషం నిత్యాన్నదానం. జలపాతం దగ్గరలోనే కుడివైపు నిత్యాన్నదాన శాల ఉంది. ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి వచ్చినవారందరికీ భోజనం పెడతారు. ఈ మార్గంలోనే ఎడమవైపు దేవస్ధానం వారివి రెండు కాటేజ్ లు వున్నాయి. మరీ అవసరమైతే అక్కడ వుండవచ్చు. ఆ మొదట్లోనే టీ షాపు ఉంది. ఇవి తప్పితే ఈ ప్రాంతంలో ఇంకేమీ దొరకవు. రాత్రిళ్ళు మనుష్య సంచారం తక్కువ వున్నా ఏమీ భయంలేదని టీ కొట్టువాళ్ళు చెప్పారు. వాళ్ళు 15 సంవత్సరాలనుంచీ అక్కడే వుంటున్నారుట.

అడవులూ, జలపాతమే కాదు. వాటిని మించిన సుందర దృశ్యమాలిక కావాలంటే మీరు వాహనంలో దిగిన దగ్గరకి వస్తే అక్కడ ఎదురుగా ఒక వంతెన, కొంచెం ఎడమవైపు వెళ్తే మరొక వంతెన వస్తుంది.  వీటిలో దేని మీదయినా బయల్దేరండి. మీరే ఊపిరి బిగబట్టి మరీ చూస్తారు ఆ అపురూప సుందర దృశ్యాలను.
ఒకే కొండరాతిలో చెక్కిన తొమ్మిది గుహాలయాలు. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగ.  గుహలంటే మరీ లోతుగా వుండవు. మనం లోపలకు వెళ్ళక్కరలేకుండానే దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ గుహాలయాల వెలుపల అందమైన శిలా మూర్తులు. భారత దేశంలో ఎక్కడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే చోట పూజించే ఆలయాలు ఎక్కడా వున్నట్లు లేదు. కానీ ఇక్కడ మాత్రం, త్రిమూర్తులు ఒకే చోట కొలువైవున్నారు. శివుని కోసం నిర్మించిన ఈ గుహాలయాలలో శివుడు మధ్యన గర్భగుడిలో లింగరూపుడై పూజలందుకుంటుంటే, ఆలయ ప్రవేశ గోడమీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వున్నాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి  విగ్రహాలుంటాయి. ఈ ఆలయాలన్నీ ఒకే శిల్పి చేత చెక్కబడటం విశేషం.



ఈ శివాలయాలన్నీ పై వరసలో వుంటే కింద ఆలయంలో త్రిముఖ దుర్గ, ముందు శివలింగం పూజలందుకుంటున్నాయి. ఈ దుర్గ కుడివైపు ముఖం మహాకాళి. నోటి నుండి అగ్నిజ్వాల వస్తూ వుంటుంది. మధ్యన మహలక్ష్మి, ప్రసన్న వదన. ఎడమవైపు మహా సరస్వతీదేవి. ప్రపంచంలో మరేచోట ఎక్కడ లేని విధంగా ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ వుంటుంది. కారణం అడిగితే పూజారిగారు తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని అలా అద్దం ద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని చెప్పారు.  ఈ  ఆలయాలు నిర్మింపబడి ఇన్ని వందల సంవత్సరాలయినాయి.






ఇక్కడ ఇన్ని సౌకర్యాలు, సాధనాలు అందుబాటులో వున్నాయి. చదువు, తెలివిగల ప్రజలు, ప్రభుత్వమూ వుంది. వీరెవ్వరూ వీటిని గురించి ఎందుకు పట్టించుకోవటంలేదు.?? కనీసం ఇలాంటి కొన్ని ప్రదేశాల చరిత్రలన్నా పరిశోధించి ప్రజలకు అందజేస్తే, మన గత వైభవం అందరికీ పరిచయంచేసిన వారవుతారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఇలాంటి అపురూప నిర్మాణాల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి ఎవరికి తోచిన కధలు వారు చెప్పుకోవలసినదేనా!!?? ఇదే ఏ విదేశాలలోనన్నావుంటే ఎంత శ్రధ్ధ తీసుకునేవారోకదా అని.






పూజారిగారు చెప్పిన ఇంకొన్ని విశేషాలు.

ఈ ప్రాంతంలో కోటి ఒక్క శివలింగాలు, 101 కొలనులు వున్నాయి. అమ్మవారి ఆలయానికి ఎదురుగా చిన్న కోనేరు మూసి వున్నది .. హైదరాబాదులో ఇళ్ళల్లో వుండే నీటి సంపుల్లా. కార్తీక పౌర్ణమినాడు చంద్రకిరణాలు ఆ నీటిలోపడి (ఆ రోజు మూత తీస్తారు) ఆ కాంతి అమ్మవారిమీద పడుతుందిట. ఆ అద్భుతం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారుట.

పక్కన ఒక గుహలో సొరంగ మార్గం వున్నది. అది హనుమనగిరిదాకా వెళ్తుంది. ఆ ఆలయాలన్నీ చెక్కిన శిల్పి సమాధి అక్కడవుంది. ఒక కొండమీదకి మెట్లు వున్నాయి. పైన ఏమున్నదంటే దుర్గాలయం అన్నారు. అలసిపోయుండటంతో ఎక్కలేదు. ఇంకో చిన్న కొండమీదకి మెట్లు..లక్ష్మీ, అన్నపూర్ణాలయాలనే బోర్డు కనబడింది. పైకి వెళ్తే చిన్ని గుహ, మనిషి కూర్చుని వెళ్ళాలి లోపలికి.. లోపల 2, 3 కూర్చోవచ్చు. లోపల లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి చిన్న విగ్రహాలున్నాయి. అక్కడ పూజారిగారు శ్రీ కాశీరెడ్డి నాయనగారి శిష్యులు. ఆయన ఈ ప్రాంతం గురించి చెప్పిన విశేషాలు

పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించేవాడుకనుక భైరవకోన అనే పేరు వచ్చిందని కొందరంటారు. పూర్వం మునులు ఇక్కడ భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేశారుకనుక భైరవకోన అనే పేరని ఇంకొందరంటారు. ఏది ఏమైనా, ఈ కోన క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనకో చిన్న ఆలయం వున్నది త్రిముఖ దుర్గాలయానికి ఎదురుగా గట్టుమీద.









పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృధ్ధిపరచినవారిలో శ్రీ అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత అనే ఆయన ముఖ్యులు. ఈయన విగ్రహం ఇక్కడ వున్నది. ఇక్కడ అన్నపూర్ణేశ్వరీమాత కొలువైవుండటానికికూడా ఆయనే కారణం. ఆయన శివ భక్తుడు. శివుడు స్వప్న దర్శనమిచ్చి నిన్ను కరుణిస్తానన్నాడట. కానీ ఎన్నాళ్ళకూ కనికరించలేదుట. అప్పుడాయన అమ్మతో మొరబెట్టుకున్నాడుట. అమ్మ ఆయన ఆర్తి గమనించి అన్నపూర్ణేశ్వరీ రూపాన కనిపించినదట. మరి నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తుడికి పరీక్షపెట్టినదట. అప్పుడా భక్తుడు నాదగ్గరకొచ్చినవాళ్ళకి నేను మంచి చెయ్యాలి. అలా నాకు వరమివ్వు. నేను బతికున్నంతకాలం నీకు ఏదోవిధంగా నైవేద్యం పెడతానని చెప్పాడుట. ఆయన పరోపకార తత్వాన్ని గ్రహించిన జగజ్జనని ఆయన్ని అనుగ్రహించటమేగాక అన్నపూర్ణాదేవిగా అక్కడే స్ధిరపడ్డది.

కాలచక్ర భ్రమణంలో కొంతకాలం మరుగునబడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 1949లో శ్రీ కాశీరెడ్డినాయన ద్వారా అందరికీ తెలిసింది. అద్భుతమైన పర్యాటకప్రాంతంగా అభివృధ్ధి చెయ్యటానికి అన్నివిధాలా తగిన ప్రదేశం ఇది. ఇలాంటి అద్భుత క్షేత్రాలను పర్యాటక స్ధలాలుగా అభివృధ్ధిపరచి, పరిశోధనలు జరిపించి వాటి చరిత్ర ప్రజలకందజేస్తే ఈ కళలకాణాచిలు మన వైభవాన్ని వేనోళ్ళ చాటుతూ ఎల్లకాలమూ నిలచివుంటాయికదా!!??





Next
Previous