దేవాలయంలో నమస్కార విధానం మఱియు దేవాలయాలలో ఎవరికి నమస్కరించాలి?

దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించాలి. ఆ దైవానికన్నా ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ ఉండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ, దేవాలయాల్లో కూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా అన్నివిధాలా చిన్నవారే. అందుకనే దైవం ముందు మానవులకు నమస్కరించటం ఇరువురికీ మంచిదికాదు. అంటారు పెద్దలు. మరి ఎలాగండీ తెలిసినవారు కనిపిస్తే పలకరించవద్దా అంటారా? పలకరింపులకు అనేక మార్గాలున్నాయి. దేవాలయంలో ఉన్నప్పుడు దైవాన్ని తప్ప ఇతరుల మీద దృష్టి ఉండకూడదు. మనస్సులో మరో ఆలోచన రాకూడదు.  ఎవ్వరితోను మాట్లాడకూడదు. 


కొందరు అక్కడవున్న అర్చకులపాదాలకు నమస్కరిస్తారు. అదికూడా మంచి పధ్ధతికాదు. నమస్కరించినవారు దైవంకన్నామానవులకు ఎక్కువ గౌరవాన్నిచ్చినట్లు అవుతుంది. అలా చేయటంవల్ల వారికి పాపం. నమస్కారం అందుకున్నవారుకూడా దైవంకన్నా తాము అధికులమని అహంకరించినట్లు అవుతుంది. వారికీ మంచిది కాదు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరికైనా నమస్కరించాల్సి వస్తే బయటికి వచ్చిన అనంతరం మాత్రమే నమస్కరించాలి. ప్రాంగణంలో ఉన్నంత వరకు అక్కడవున్న దైవం పేరు చెప్పి మాత్రమే నమస్కరించాలి. అంటే ఆ నమస్కారం ఆ దైవానికే చెందుతుంది. వీలైనంతగా దైవనామ స్మరణ మాత్రమే చేయాలి.

ఆలయాల్లోనేకాదు, కొన్ని ప్రధాన ఆలయాలున్న కొండలమీదకూడా…అంటే తిరుపతి, శ్రీశైలం లాంటి ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఆలయాలున్న కొండలమీద ఆ ఆలయాల్లోనే కాదు, ఆ కొండలమీదకూడా ఎవరికీ నమస్కరించకూడదు. అక్కడి దైవం పేరుచెప్పి నమస్కరించాలి. అంటే వారిలోకూడా ఆ స్వామినే చూసి ఆ స్వామికి నమస్కరించినట్లు.

దైవానికి నమస్కారం చేసే విధానం.
తల దించి, వంగలేనివారు కొంచం నడుము వంచి, రెండు చేతులను కలిపి రెండు చేతుల బ్రొటన వ్రేళ్ళు నుదురుకి తాకించి, అనంతరం నమస్కార ముద్రని అలాగే హృదయానికి తాకించి మనసులోని కోర్కె కన్నులు తెరచి స్వామి వారి పాదాలను చూస్తూ నివేదన చేయాలి. ఎప్పుడూ కూడా ఆలయాలలో ఉన్న దేవతా మూర్తులను సరాసరి ముఖాన్ని చూడకూడదు. "ఆపాద మస్తకం" చూడాలి. అంటే పాదం నుండి మొదలై ముఖాన్ని చూడాలి. సరాసరి ముఖాన్ని చూడకూడదు.


Next
Previous