ప్రవర అంటే ఏమిటి?




|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత ---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ .........................శర్మన్ అహం భో అభివాదయే ||

ఉదాహరణకు: చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు “అంగీరస, బారహ్స్పత్య, భరద్వాజ” త్రయార్షేయ ప్రవరాన్విత భరద్వాజసగోత్రః ఆపస్తంభ సూత్రః శ్రీ కృష్ణ యజుర్వేధ శాఖాధ్యాయీ రామ శర్మ అహంభో అభివాదయే
ప్రవర చెప్పునపుడు , లేచి నిలబడి , చెవులు చేతులతో ముట్టుకుని ఉండి , ( కుడి చేత్తో ఎడమ చెవి , ఎడమ చేత్తో కుడి చెవి) , ప్రవర చెప్పి , వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను . పై ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, తమపేరు చెప్పి శర్మా అని చెప్పాలి.

సూత్రము : సూత్రము ప్రవరలో మన సూత్రమేదో కూడా చెపుతాముకదా ..సూత్రమంటే ఏమిటి ? యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి . ఉదాహరణకు , ’ దర్శ పూర్ణ మాస యాగము , అశ్వమేధ , పురుష మేధ మొ|| నవి . ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసిఉండవలెను . యజ్ఞ యాగాదులు మాత్రమే కాక , మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్దతిలో , సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము . ఈ పద్దతులను , సాంప్రదాయాలనూ వివరించేవే సూత్రాలు . ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసియున్నారు . యజుర్వేదము పాటించేవారికి ’ ఆపస్తంబుడు ’ ’ బోధాయనుడు ’ సూత్రాలను రాసియున్నారు . ఋగ్వేదీయులకి ’ ఆశ్వలాయనుడు ’ రాశాడు . బోధాయన సూత్రాలు చాలా వివరాలతో , ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి . బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంబుడు , ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించి , అనవసరమైన వాటిని కుదించి , ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగ రాశాడు . ఈనాడు యజుర్వేదము అనుసరించేవారిలో అధిక శాతము ఆపస్తంబుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు . అయితే బోధాయన సూత్రాలను పాటించేవారుకూడా అనేకులున్నారు . ఆపస్తంబుడు శ్రౌత , గృహ్య , ధర్మ మరియు శుల్బ సూత్రాలను రాశాడు . వీటన్నిటినీ కలిపి " కల్ప సూత్రాలు " అంటారు . మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసినవారి పేరు కూడా ప్రవరలో చెప్పడము ఆనవాయితీ అయింది . ప్రవర అనేది ఒకమంత్రము కాదు . అది కేవలము మన పరిచయాన్ని చెప్పడము మాత్రమే.

Next
Previous