సతీదేవి ఆత్మసమర్పణకు అసలు కారణం ఏమిటి?

సతీదేవిని ఆవిడ తండ్రి దక్ష ప్రజాపతి అవమానాల పాలు చెయ్యడం, శివుని ద్వేషించడం అందువలన ఆవిడ ఉక్రోషం భరించలేక తన పతి మాట వినకుండా రావడం వలన ఆ దేహంతో మరల తిరిగి ఆయన వద్దకు వెళ్ళలేక యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మమొనర్చుకుంది అన్న ఇతిహాసం (ఇలా జరిగింది ) అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలిసిన శివుడు ఆవిడను అలా ఎలా వదిలేశాడు, మనవంటి పనికిమాలిన వాళ్ళను కాపాడగలిగిన వాడు ఆవిడను కాపాడలేక పోయాడా, త్రికాలవేత్తి అయిన ఆయన ఆ విషయం ముందు తెలిసి ఇది సరిదిద్ద లేకపోయాడా అని నాస్తికులే కాక ఆస్తికులకు కూడా తరచు కలిగే అనుమానం. ఈ విషయానికి సంబంధించిన చిక్కుముడి విప్పే సంఘటన తులసీదాస “శ్రీ రామ చరిత మానసము” లో వివరింపబడి వుంది.
ఒకసారి పరమశివుడు నిర్గుణ పరబ్రహ్మ రామావతారంలో భూమి మీద నడయాడుతోందన్న విషయం తెలిసిన వాడై ఆయనను మాంసశరీరంతో ఒకసారి దర్శించాలని కోరిక కలవాడై సతీదేవిని వెంటబెట్టుకుని అగస్త్యాశ్రమానికి విచ్చేస్తాడు. వారిరువురు కొంతసేపు రామనామ మహిమగురించి చర్చించుకుని ఆ ఆనందంలో మునిగి ఉంటారు. తరువాత శివుడు అలా అరణ్యంలో రాముని దర్శిస్తాడు. అప్పటికి రాముడు సీతాదేవి వియోగంతో దుఃఖితుడై ఆవిడను వెదకపూని అరణ్యాన్ని శోధిస్తుంటాడు. అక్కడ ఆయనను ఒక జంగమదేవరగా దర్శించుకుని ఆయనకు ప్రణమిల్లి ఆయనకు త్వరలోని సీతాసాధ్వి సమాగమం అవుతుందని ఊరడిల్లె మాటలు చెప్పి ఆయనను దర్శించిన అలౌకికానందంలో మునిగి ఉంటాడు. సతీదేవికి భార్యను పోగొట్టుకున్నవానికి, అతని భార్య జాడ తెలియని వానికి అన్నీ తెలిసిన తన పతి ఎందుకు ప్రణమిల్లి ఆ ఆనందంలో ఎందుకు మునిగి ఉన్నాడో, అటువంటి వారిని పరబ్రహ్మ అని ఎందుకు సంబోదిస్తున్నాడో అర్ధం కాలేదు. శివుడు ఆవిడ మనసెరిగి ఇత:పూర్వము అగస్త్యాశ్రమంలో ముచ్చటించుకున్న పరబ్రహ్మ ఆయనే అని చెబుతాడు. కానీ ఆవిడకు నమ్మశక్యం కాక తాను వెళ్లి చూసి వస్తానని చెప్పింది. త్రికాలవేది అయిన శివుడు జరగబోయే అనర్ధం తెలుసుకుని ఒక చిరునవ్వు నవ్వుతాడు.
రాముని తక్కువ అంచనా వేసిన సతీదేవి రామలక్ష్మణులు నడిచే దారిలో సీతమ్మ వారి వేషంలో ఎదురవుతుంది. లక్ష్మణుడు భ్రాంతికి లోనుకాగా రాముడు మాత్రం ఆవిడతో, ఏమ్మా శివుడు లేకుండా నీవోకత్తివే ఇలా వచ్చావేమి అని పలుకరించగా, ఆవిడకు అన్నివైపులా రాముడే కనిపించి విష్ణుమాయ ఆవరిస్తుంది. ఆవిడకు అప్పుడు జ్ఞానోదయమై ఆయన పాదాలపై పడి తన పతి వద్దకు వెళ్తుంది. రాముని సతి అయిన సీతమ్మ వేషం లో కనబడిన తన సతి అయిన సతీదేవిని ఆ దేహముతో మరల భార్యగా ఏలుకోలేనని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్ళు ఆయన ధ్యానంలో ఉండడం, తరువాత దక్ష యజ్ఞం జరగడం, అందులో ఆవిడ తన శరీరాన్ని వదిలి మరల హిమవంతుని కూతురుగా మరొక శరీర స్వీకారం చెయ్యడం మనకు తెలిసినదే.
ఇక్కడ మరొక్క అనుమానం రావచ్చును. ఇలా ఎప్పుడు జరిగింది. మనకు ఇప్పుడు తెలుస్తున్న రామాయణం నాటికి పార్వతీదేవి, ఆవిడ అక్క గారైన గంగ గురించి వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉన్నది కదా అని. ప్రతీ కల్పములో రామాయణం జరుగుతుంది. ప్రతి కల్పములో శ్రీమన్నారాయణుడు రాముని అవతారం స్వీకరించి దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తాడు. ఈ కధ సతీదేవి సశరీరంగా ఉన్న కల్పంలో జరిగిన వాస్తవం. విష్ణువుకు బహి:ప్రాణము శివుడు. శివుడు లక్ష విస్తారమైన రామాయణాన్ని రాక్షస, మానవ, దేవతలను మూడు భాగాలగా ఇచ్చి “రామ” అన్న తారక మంత్రం మాత్రం తాను ఉంచుకున్నాడు. కాశీనగరంలో ప్రాణం వదిలే ప్రతీ ప్రాణికి రామ తారక మంత్రం ఉపదేశించి వారిని ఉద్ధరిస్తాడు.
“శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే”
“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే “
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!

Next
Previous