శివుడికి ఇల్లు ఎందుకు లేదు?






      ఒకనాడు పార్వతీదేవి శివుడితో! స్వామి ఇంద్రుడికి గృహం ఉంది, దేవతలకి గృహాలు ఉన్నాయి. కాని మనకి మాత్రం లేదు. ఒక సుందరమైన ఇల్లు ఒకటి నిర్మింపజేయండి. అని అడిగింది. అప్పుడు శివుడు! ఒద్దు పార్వతి. మనకి ఇల్లు అచ్సిరాదు. ఆలోచన మానుకో అన్నాడు. అయినా పార్వతి వినకుండా "కుదరదు. ఒక అద్భుతమైన అపురూపమైన గృహం కావలసిందే"  అని పట్టుబట్టేసరికి శివుడు సరే అని అమరశిల్పిని పిలిపించి అత్యద్భుతమైన ఇల్లు ఒకటి కట్టమని ఆజ్ఞాపించాడు. అమరశిల్పి తక్షకకోటిని పిలిపించి బ్రహ్మాండమైన గృహ నిర్మాణం చేశాడు. గృహం పూర్తయింది. గృహప్రవేశానికి దేవతలందరికీ అందరికి ఆహ్వానం పంపించారు. రావణుడితో సహా తన భక్తులని కూడా ఆహ్వానించాడు. వచ్చినవారికి ఎవరికి ఏ వరం కావాలో కోరుకొండి అడిగిన తక్షణమే ఇచ్చేస్తా అభయం ఇచ్చాడు.

           ఆ ఆహ్వానం రావణాసురుడికి కూడా వెళ్ళింది. గృహప్రవేశానికి అందరు వచ్చి వరాలు అడిగి తీసుకుంటున్నారు. రావణుడు వంతు వచ్చింది. రావణుడు! శివ ఏవరం కావాలన్నా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చావ్ కనుక అడిగింది కాదనకూడదు అన్నాడు. సరే ఏమి కావాలో కోరుకోమంటే ఈ ఇల్లు నచ్చింది. నాకు ఈ ఇంటిని వరప్రసాదంగా అనుగ్రహించు స్వామి! అనేసరికి శివుడు పార్వతి ఆశ్చర్యపోయారు. శివుడు చేసేది లేక సరే అనుగ్రహించాను తీసుకో అని ఆ ఇంటిని ఇచ్చేశాడు. ఇలా ఒక ఇల్లు రావణుడి వెళ్ళిపోయింది.

 ఇంకోన్నిరోజుల తరువాత పార్వతీదేవి శివుడిని మంచి ఇల్లు కట్టించమని మళ్ళికోరింది. శివుడు పార్వతీదేవి కోరిక మన్నించి దేవశిల్పిని పిలిపించి మరో గృహం కట్టించాడు. ఐతే ఈ సారి రావణుడిని పిలవలేదు. కాని ఈ గృహప్రవేశానికి దేవతలందరితో పాటుగా శనైశ్చరుడిని ఆహ్వానించడంతో ''శని''కూడా ఆహ్వానం మేరకు వచ్చాడు. 

ఆయన్ని చూడగానే అగ్నిహోత్రుడు గజగజ వొణికిపోయాడు. శని సామాన్యుడు కాదు ఎవరినైనా ఇట్టే పట్టేస్తాడు. ఒకసారి పట్టుకున్నాడా వాడి పని అయిపోయినట్లే! నన్ను చుశాడంటే ఏమి చేస్తాడో శని అనుకుని భయపడి ఆ భయంతో ఒకేసారి భగ్గున ప్రజ్వలించి ఆ గృహాన్ని కాస్తా తగలబెట్టేశాడు. అలా రెండో ఇల్లుకూడా పోయింది. చూశావా పార్వతీ! మనకి ఇల్లు అచ్చుబాటు లేదు, ఒద్దు అని చెప్పాను కదా! వినలేదు నువ్వు. చూశావు కదా ఏమి జరిగిందో! ఇక ఇంటిమీద ఆశలు వదిలిపెట్టు అనగానే పార్వతీదేవి నిరాశకి లోనై చేసేది  లేక సరే అని ఊరుకుంది. ఆ విధంగా శివుడికి ఇల్లు లేకుండా పోయింది.



Next
Previous