నీ అడుగుల సడి వినగానే మనసు మరచింది మౌనాలను! (తెలుగు కవితలు)
నీ అడుగుల సడి వినగానే
మనసు మరచింది మౌనాలను
లేచి ఎగసింది గగనాలకు

చుక్కలతో తోరణాలు కట్టి
ఆకాశ పందిరిలో నీకై ఎదురుచూస్తూ

నా చీకటి లాంటి నిశ్శబ్దాన్ని నింపే వెలుగు నీవవుతావా!


వెలితిని తాగేసే శూన్యాన్ని చేరిపేసే
వెన్నెల నీవవుతావా!

ఆసక్తి నశించిన జీవితపు మూలల్లో
ఆర్తివి నీవు అవుతావా!

సంద్రపు తీరంలో పోగొట్టుకున్న
కాలపు వెన్నెల వై కరుణిస్తావా!

ఎడారి పున్నమలో వెలుగుల రాత్రుల్లో
జతకూడే జావళి నీవవుతావా!

ఎన్నో చెప్పాలని, మరెన్నో అడగాలని
అనుకుంటూ ఉంటా!

నే పారేసుసుకున్న రంగుల కలల పువ్వుల్ని
నీవు కాక వేరెవరూ పోగుచేయలేరు.

ఒకటి మట్టుకు నిజo! 
నాలో ప్రవహించే నీ ప్రతీ భావము
నవనవోన్మేషమే.
నన్ను మురిపించే నీ తలపులన్ని
నిత్య నూతనమే.


అనుభూతులు లోకం అయితే
అందులో జాబిలి నీవు వెన్నెల నేను.

నీ, నా కనులలో కనిపించే కలల తీరాలు
కలిసేది ఒకే కోరికల సాగరంలో.


నిశీధి దారుల్లో కలసి నడిచే మనిద్దరి నీడలు
ఒకటే.

అస్తవ్యస్థమైన జీవితపు ఆరాటాలను
సుకుమారంగా నింపుకునే నిండుతనం నీవే.

నా కనురెప్పల్లో దాగిన అద్భుత స్వప్నానివి నీవు.
కళ్ళలో అపూర్వoగా ఆవిష్కరించిన సుందర చిత్రానివి నీవు! నీవే!


సంధ్య.

Next
Previous