1200 సంవత్సరాల అద్భుతమైన “కృష్ణుని వెన్న బంతి”




1200 సంవత్సరాల అద్భుతమైన “కృష్ణుని వెన్న బంతి” గురించి తెలుసుకుందాం.....

మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో ఎన్నో అద్భుతాలు కొలువైన గ్రామము. 7వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణము మామల్లపురం. మామల్లపురమనేది కాలక్రమంలో మహాబలిపురంగా ఖ్యాతి గడించింది. ఈ పట్టణం అప్పటి పల్లవ ప్రభువు అయిన మామల్ల పేరు మీద కట్టబడిందని చరిత్ర చెబుతోంది. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటం వలన ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ఇక్కడ ప్రాంతవాసులు చెబుతుంటారు. పల్లవుల పరిపాలనా కాలములో ఈ ప్రాంతంలో స్వర్ణయుగం వెలసిల్లింది.

పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని, కొంత కాలము పరిపాలించారు. అప్పుడు కట్టినవే ఈ శిల్ప కళా సంపద. పల్లవులు దీన్ని మంచి రేవు పట్నంగా తీర్చిదిద్ది, దాని కోసం ఇక్కడ కొండమీద లైట్ హౌస్ కట్టారు. 1200 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయములో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న ఈ రాయిని శ్రీ కృష్ణుని వెన్న బంతి అని పిలుస్తారు. ఈ రాయి అతి చిన్న ఆధారంతో చాలా సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని కదిలించటానికి చాలా ప్రయత్నాలు చేసారు, కానీ ఈ రాయిని కదిలించటం ఎవరివల్లా కాలేదు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కృష్ణుని వెన్న బంతి గురించి తెలుసుకుందాం…

1.ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఈ రాయిని 1908 లో బ్రిటీష్ ఆర్థర్ ఆలీ అనే దొర చూసి ఇది ప్రమాదము అని దీన్ని తొలగించాలని ప్రయత్నం చేయగా అది కొంచెము కూడా కదలలేదు.
2.ఆ తర్వాత 7 ఏనుగులను తీసుకువచ్చి వాటికి పెద్ద పెద్ద గొలుసులు కట్టి పై నుంచి కిందకు లాగాలని శతవిధాలా ప్రయత్నించినా అది కొంచెం కూడా కదలలేదు అని చరిత్ర చెబుతోంది.
3.ఈ రాయి 20 అడుగుల వెడల్పు , పొడవు , ఎత్తు కలిగి రెండు చదరపు గజాల స్థలములో ఉంది.
4.పూర్వ కాలంలో రాజుల కళాత్మక హృదయానికి నిదర్శనము ఈ ప్రసిద్ద ఏకశిలా దేవాలయము. ఇందులో ముఖ్యమైనది శ్రీ కృష్ణుని రాయి , ఈ రాయిని శ్రీ కృష్ణుని వెన్న బంతి అని పిలుస్తారు.

అప్పటి పల్లవ రాజు నరసింహవర్మ ఈ రాయి ఆకాశదేవుని రాయని, ఈ రాయిని ఎవరూ తాకకూడదని చెప్పారని కథనము. కొంత మంది దేవాలయం కోసం తెచ్చిన రాయి అని దానిని మధ్యలోనే వదిలి వెళ్ళారని చెప్తారు.
Next
Previous