అష్ట లక్షణాలు (ఆత్మ గుణాలు)(శృంగేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి బోధనలు)


మహర్షి గౌతముడు 8 ఆత్మగుణాల గురించి చెప్పాడు. ఈ గుణాలు తప్పక అందరూ కలిగి వుండాలని సూచించాడు. ఈ గుణాలు ఒక మనిషికి మానసిక ప్రశాంతత, సంతోషం కలిగిస్తాయి. వీటివల్ల కలిగే పుణ్యం వలన అతడికి ఇతోధిక ఫలాలు కలిగి ఉతరోత్తర జన్మలలో కూడా లాభపడతాడు. ప్రతి ఒక్కరూ ఇటువంటి గుణాలను పెంపొందించుకుంటే ఈ ప్రపంచమే ఆనంద నందనవనం అవుతుంది.

1.
సకల ప్రాణికోటి మీద దయ :

భగవంతునికి ప్రత్యేకంగా సాధించవలసిన అవసరము కానీ, అగత్యము కానీ ఏమి వుండదు. కానీ మానవాళి ఉద్ధరణ కొరకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. మనం ఒకరికి సహాయం చెయ్యగలిగి వున్నప్పుడు తప్పక సహాయ పడాలి. ఇందుకు మనకు భగవంతుడే స్వయంగా దారి చూపించాడు. మన పక్కవారి బాధలను తీర్చాలనే భావనే కరుణ. కొందరికి స్వతహా కరుణాదృష్టి వుంటుంది, మరికొందరికి వారితో పాటు ఉన్నవారి వలన జనియిస్తుంది. శ్రీకృష్ణుడు గీతలో తనకు ఇష్టమైన లక్షణాలలో కరుణ, స్నేహభావం, ఇతరులపై ద్వేషం లేకపోవడం అని ప్రస్తావించాడు.

ఒకరిపై ద్వేషం వలన మన శాంతం కోల్పోతాము. మనం ఇలా అనుకోవాలి. నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాలాగే అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. నాకు బాధ కలిగితే ఎలా వుంటుందో పక్కవారికి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా బాధ పడరాదు”. ఇటువంటి భావనలు ఉన్నవారికి త్వరగా ప్రశాంతత లభిస్తుంది. కరుణ వలన క్రోధం కూడా అణగదొక్కబడుతుంది.

2.
ఓర్పు :

సాధారణంగా ఎవరికైనా తనకిష్టంలేని విషయం కానీ పరిస్థితి కానీ ఎదురైనప్పుడు కోపోద్రిక్తుడైపోతాడు. వెంటనే పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతడికి బలం వుంటే వెంటనే ఆ పని కూడా చేసేస్తాడు. ఇది గొప్పవారి లక్షణం కాదు. అతడికి శక్తి వుండి కూడా కోపానికి వశమవకుండా వివేచన తో క్షమించడం చాలా గొప్ప లక్షణం. రామాయణంలో రాముని గురించి ఇలా అంటారు: తనకు జరిగిన హానిని అసలు గుర్తుపెట్టుకోడు, ఆయన క్షమ ధరిత్రిని మించినది.
కోపం వలన మనకు ఏమిటి లాభం ? మన ప్రశాంతత, పక్కవారి శాంతం కూడా హరిస్తాము, సర్వదా త్యాజనీయం ఈ క్రోధం. నేనొక్క మాట చెబుతాను. ఉచితమనిపిస్తే ఇలా అలవర్చుకోండి.

పరులను సంతోషపెట్టడం ఒక పూజ లాంటిది. కాబట్టి పక్కవాడికి నన్ను విభేదించడం వలన అతడికి సంతోషం నేను కలిగిస్తున్నానంటే నేను పెద్దగా కష్ట పడకుండా దైవపూజ చేస్తున్నాను అతడిని సంతోషపెట్టడం ద్వారాను. కాబట్టి అతడే నాకు మహదవకాశం ఇచ్చాడుఅని సంతోషపదండి. మీకు ప్రశాంతత వస్తుంది.


(శృంగేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి బోధనలు)


3. పరనింద చెయ్యకపోవడం:


సాధారణంగా సంపూర్ణ విజయం సాధించనటువంటి వారు, లేక ప్రావీణ్యం లేనివారు విషయపరులలోని లోపాలను ఎత్తి చూపుతూవుంటారు. అటువంటి పరనింద కేవలం తమ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప దానివల్ల ఒరిగేదేమీ వుండదు. ఇది చాల చెడ్డ అలవాటు. మనకన్నా ఉన్నతమైన ప్రావీణ్యం ఉన్నవారిని చూసి మనం సంతోష పడాలి, వారిని ప్రోత్సహించాలి. శంకరులు ఇతరులను గేలి చేస్తున్నప్పుడు అటువంటి మాట విన్నవారు కూడా పాపం మూట కట్టుకున్న వారే అని అంటారు. కేవలం అటువంటి ఖండన మాటలు విన్నవారికే పాపం అంటే అటువంటి పరుషమైన మాటలు మాట్లాడేవారు ఎంత పాపం మూటకట్టుకుంటూవున్నారో ఆలోచించండి.

ఒక మనిషి ఆనందం గా ఉన్నవారితో స్నేహబాంధవ్యాలను పెంచుకుంటున్నాడనుకుందాం. అప్పుడు అతడు కూడా ఆనందం పొందుతాడు. వారి విజయాలను ఆస్వాదిస్తాడు. వారితో పాటు తాను కూడా ఉన్నతిని పొందుతాడు. ఒక తండ్రి తన పిల్లల ఉన్నతిని చూసి ఎంత సంతోష పడతాడో, మనం కూడా మన పక్కవారి ఉన్నతిని చూసి ఆనందించాలి. సంకుచిత స్వభావులు నేను నాది అని గిరి గీసుకు కూర్చుంటారు అదే విశాల హృదయులు జగమంతా తన కుటుంబమనే అనుకుంటారు. కాబట్టి అసూయ వదిలి అందరి సంతోశంలోను తాను కూడా పాలు పంచుకోవాలి. అందువలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.

4.
స్వచ్చత

మన విధివశాత్తు ఎవరైనా కుళ్ళు బట్టలు వేసుకున్న, స్నానం చేసి పుష్కరమైన , హేయమైన నడవడిక, ఆహార్యం కలిగిన ఒకడిని చూస్తె మనకు ఎలా అనిపిస్తుంది? అతడి నుండి దూరంగా తొలగిపోవాలనిపిస్తుంది. కానీ అటువంటి మనిషికి తాను ఆశుభ్రంగా వున్నానని అనుకోడు. అతడికి అదే అత్తరు వాసనలా వుంటుంది. అదేమాదిరి ఎవరికైనా మలినమైన అనారోగ్యమైన అలవాట్లు వుంటే అది అందరికీ చేటు అవుతుంది. ఉదాహరణకు జనసమ్మర్ధమైన ప్రదేశాలలో ఉమ్మి వేసేవారు, పొగ తాగేవారు, ఇతరత్రా అలవాట్లు ఉన్నవారి వలన వారికే కాదు మొత్తం సమాజానికే చెడు చేస్తున్నారు. కేవలం శారీరకమే కాక మానసిక పరిశుద్ధత వుండాలి.


(శృంగేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి బోధనలు)


యస్య నిఃశ్వసితం వేదాః యోవేదేభ్యోఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

5.
బద్ధకం లేకుండా వుండటం

చాలా మంది తాము ఒక పని చెయ్యలేని స్థితిలో ఉన్నామని సాకులు చెబుతూ వుంటారు. అటువంటి బద్ధకస్తుడిని ఏ యజమాని మెచ్చడు. తాను చదవవలసిన పుస్తకాలను పక్కన బెట్టే ఏ విద్యార్ధి పరీక్షలలో ఉత్తీర్ణుడుకాలేడు. ఎవరైతే తనకు అప్పజెప్పిన కార్యం మీద పూర్తిగా మనస్సు లగ్నం చేసి ఉంటాడో అటువంటి వాడి మనస్సు ఇతర పనులపై కానీ ఖాళీగా వుండాలని కానీ కోరుకోదు. కాబట్టి అందరూ అత్యంత ఉత్సాహంతో వార్ కర్మలను చెయ్యాలి.

6.
శుభప్రదంగా వుండడం

మనం ఎవరినైనా కలిస్తే వారినే కాక వారి హావభావాలను కూడా గమనిస్తాము. మనం ఎప్పుడూ ప్రసన్నంగా వుండాలి. మన మాట, నడవడిక కూడా శుభప్రదంగా వుండాలి. పెద్దవారు కనబడితే మనం కూర్చున్న ఆసనం మీదనుండి లేచి వారిని ఆహ్వానించాలి. మాట కూడా ప్రసన్నంగా ఆహ్లాదంగా వుండాలి. ఎప్పుడూ సత్యం మాట్లాడాలి. హాని కలిగించే సత్యం ఉన్నట్టయితే దానిని వారికి భయపెట్టేలా చెప్పకూడదు. మన పలుకులు ఆహ్లాదంగా సత్యంగా వుంటే అదే మనకు రక్ష

7.
ఉత్సాహంగా ధర్మబద్ధంగా వుండడం

మనం నిత్యం దానధర్మాలతో ధార్మిక జీవనం సాగించాలి. మొహం, లోభం రెండూ కూడా నరకానికి మార్గాలు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పి వున్నాడు. నీలకంఠ దీక్షితులు వారు నీ మరణం తరువాత కూడా నీతో నీ సొమ్మును తీసుకుపోదాం అనుకుంటే నువ్వు నేటి నుండి దానం చెయ్యడం మొదలు పెట్టు అని హెచ్చరించారు. తాను చేసిన ధర్మమే తనను కాపాడుతుంది. ఆ దానమే తనతో వెన్నంటి వుంటుంది. తనకున్నంతలో దానం చెయ్యాలి. ఒక భక్తునికి ఒక సాధువు రోజు ఒక కూరగాయ దానం చేయ్యమని చెప్పాడు, దానివలన అతడికి ఉన్నత గతులు కలుగుతాయని దీవించాడు. అతడు రోజు అలా చెయ్యడం వలన అతడు మరణించాక మరుజన్మలో ఒక రాజుగా జన్మించాడు. అతడి అదృష్టం కొద్దీ అతడికి పూర్వజన్మ జ్ఞాపకం వుంది. ఈ జన్మలో కూడా రోజుకొక కూరగాయ దానం చేసాడు. ఆశ్చర్యకరంగా అతడు మరణించాక మరు జన్మలో భిక్షువుగా జన్మించాడు. ఈ సారి కూడా అతడికి పూర్వజన్మ జ్ఞాపకం వున్నది. అతడికి గత రెండు జన్మల గురించి తెలిసి తాను ఏమి తప్పు చేసాడో మధనపడ్డాడు. ఒక సాధువుకు సాష్టాంగ పడి విషయం అడుగగా అతడికి ఆ సాధువు తన శక్తి కొద్దీ దానం చెయ్యాలని, ముందు జన్మలో అతడి శక్తి కేవలం ఒక శాకం దానం చెయ్యగలిగి ఉన్నాడని, రాజు జన్మలో ఎంతో వున్నా పీనాసితనంతో కేవలం ఒక్క కాయ మాత్రమె దానం చెయ్యడం వలన సరైన పుణ్యం సంపాదించలేదని అందుకు ఇటువంటి జన్మ ప్రాప్తించింది అని సెలవిచ్చాడు. మనం కూడా మనకు సాధ్యమైనంత వరకు అర్హులైన వారికి దానం చెయ్యాలి .

8.
నిర్మోహత్వం

మనకు సంభవించే ఎన్నో అనర్ధాలకు కారణం మన ప్రాపంచిక మొహం. నిర్మోహత్వం వలన సచ్చిదానందం కలుగుతుందని పంచదశిలో శంకరులు చెప్పారు. వారి వారి కర్మలను వాటి ఫలాలకు అతీతంగా ఆచరించడం తప్పక సాధ్యపడుతుంది. మోహం వలన మన కర్మ చెయ్యగలిగే సామర్ధ్యం కుంటుపడుతుంది. సాధారణంగా ఎందరో సర్జన్లు తమ ఇంటివారి మీద శస్త్ర చికిత్స చెయ్యలేరు, కారణం మోహం. కాబట్టి మొహాన్ని త్యజించాలి.
Next
Previous