భక్తి(శృంగేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి బోధనలు)

మానవులకున్న సహజ లక్షణం ప్రేమించడం. ఇష్టపడడానికి ఒక వస్తువు వుండాలి. ఆ సద్వస్తువే భగవంతుడైనప్పుడు దానినే భక్తి అని అంటాము. నారదుడు భగవంతునిపై అత్యంత ప్రేమతత్వాన్ని భక్తి అని నామకరణం చేసాడు. ఎవరికైతే పరిపూర్ణ భక్తి కలుగుతుందో అతడికి మరొకటి ఏది అవసర పడదు, అతడు నిత్యత్రుప్తుడిగా ఆనందంగా ఉంటాడు. ప్రాపంచికవిషయాలపై ఆసక్తి, ప్రేమ, మమకారం వలన బంధం జనియుస్తుంది. అది మోక్షానికి ప్రధాన అడ్డంకి. ప్రాపంచిక వస్తువులు నిరంతరం ఆనందాన్నివ్వవు. కొంతసేపు ఆనందాన్నిచ్చి తరువాత అదే దుఃఖ హేతువు కూడా అవుతుంది. ఉదాహరణకు మనకు ఒక మధుర ఫలం మీద ఆసక్తి ఉన్నదనుకోండి. ఒకటి, రెండు, మూడు వరకు ఆసక్తిగా తినగలము, తరువాత అదే మొహం మొట్టి దుఃఖానికి హేతువు అవుతుంది. మనం కోరుకునే వస్తువు నిరంతరం లభించకపోవచ్చు, లభించినా వాటిలో లోపాలున్డచ్చు.

భగవంతుడు సదా ప్రకాశవంతుడు, వాత్సల్యానికి అర్హుడు, సనాతనుడు, నిరంతరం లభించేవాడు అలాగే ఏమాత్రం లోపం, మచ్చ లేనివాడు. అయినా భగవంతుని కన్నా అందమైన, ప్రేమించదగిన వస్తువు కానీ, మనిషి కానీ మరోకరున్నారా? ఆయన లీలలు ఎంతో ఆనందదాయకాలు. మునులు కూడా నిరంతరం ఆయన ధ్యానంలోనే గడుపుతారు. స్వాభావికంగా ఆయన నిర్గుణుడు, నిరాకారుడు అయినా కూడా మన మీద అత్యంత వాత్సల్యంతో మన సౌలభ్యం, ధ్యాన వస్తువుగా గుర్తుకోవడం కోసం ఒక రూపంలో దర్శనమిస్తాడు. మన శ్రుతులు ఆయనకున్న ఎన్నో అద్భుతమైన లీలావతారాల గురించి ప్రస్తుతించింది. మార్కండేయ పురాణం లో దేవి మహాత్మ్యం గురించి ఇలా చెప్పబడి వుంది. “అమ్మా, నువ్వు సకల సౌందర్య రాశివి. ప్రపంచంలో వున్న సౌందర్యాన్నంతటినీ రాశిగా పోస్తే నీ కాలిగోటికి సరితూగదు కాదమ్మ. నీవే అత్యంత సౌభాగ్యదాయినివి. నీవే అత్యంత మనోహరమైనదానివి“

ఒక భక్తుడు తన కోరికను ఇలా చెబుదామనుకున్నాడు “అమ్మా.. నువ్వు నీ కరుణారస దృష్టిని నా పై ప్రసరించవమ్మా“ అని. అతడు “భవానీ త్వం” అనేలోపు తనను పిలిచిన పిల్లవాని కోరిక తీరుద్దామనే ఆత్రుతతో ఆ తల్లి “భవానీ త్వం” స్థితిని అనుగ్రహించిందిట. ఇది సౌందర్యలహరిలో శంకరులు ఎంతో ఆర్ద్రంగా వివరించారు. దైవానుగ్రహం అందరికీ సమానంగా ప్రస్తిస్తుంది. ఒకరి జాతి, కుల మత భేదం లేకుండా అందరిమీద సమానంగా ప్రసరిస్తుంది.
Next
Previous